top of page

మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ: పోలీసుల అండతో టీడీపీ దౌర్జన్యాలపై వైసీపీ తీవ్ర ధ్వజం

Writer: VOICE OF HERALD
VOICE OF HERALD
5 days ago
2 min read

ప్రొద్దుటూరు మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ: పోలీసుల అండతో టీడీపీ దౌర్జన్యాలపై వైసీపీ తీవ్ర ధ్వజం

పాత్రికేయులు సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
పాత్రికేయులు సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి

ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు పురపాలక సంఘ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియలో అధికార టీడీపీ నాయకులు, పోలీసులు కుమ్మక్కై ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం స్థానిక వైఎంఆర్ కాలనీలోని వైసీపీ మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి నరసింహ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, గత మూడు రోజులుగా నామినేషన్ల దాఖలు మొదలుకొని, నేటి పరిశీలన ప్రక్రియ వరకు వైసీపీ శ్రేణులు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు, టీడీపీ నాయకులతో ఏకకాలంలో యుద్ధం చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. 52 వార్డులకు గాను దాఖలైన 215 నామినేషన్లలో కేవలం 52 మంది టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థుల నామినేషన్లను మాత్రమే ఆమోదించి, వైసీపీ, కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థులైన 163 మంది నామినేషన్లను తిరస్కరించడం భారతదేశ చరిత్రలోనే ఎక్కడా చూడని విడ్డూరమని అన్నారు. అలాగే ఛైర్మన్ పదవికి దాఖలైన 11 నామినేషన్లలో 6 టీడీపి తరపున వేయగా, ఉన్నత విద్య చదివిన వైసీపీ అభ్యర్థి పోరెడ్డి నరసింహ రెడ్డి, ఇర్ఫాన్ బాషా, పుత్తా లక్ష్మిరెడ్డి తదితర ఐదుగురు ఇతర పార్టీల అభ్యర్థులు పత్రాలు సక్రమంగా నింపలేదనే సాకుతో తిరస్కరించారని, ప్రొద్దుటూరులో కనీసం ఓటు హక్కు కూడా లేని ఎమ్మెల్యే సోదరుడు నంద్యాల రాఘవరెడ్డి నామినేషన్ మాత్రం సక్రమంగా ఉందనడం హాస్యాస్పదమని మండిపడ్డారు. 14 కౌంటర్లలో స్క్రూటినీ నిర్వహిస్తున్న 70 మంది అధికారులను ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు బెదిరించి వారి ఆత్మాభిమానాన్ని చంపేశారని, మాట వినని ఉద్యోగులపై దాడులకు తెగబడ్డారని ఆరోపించారు. రెండున్నర ఏళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఎగ్గొట్టి, పట్టణంలో కనీస పారిశుధ్యం కూడా పట్టించుకోకుండా అభివృద్ధిని విస్మరించిన కూటమి ప్రభుత్వానికి ప్రజలంటే భయం పట్టుకుందని, అందుకే 1,37,202 మంది ఓటర్లు ఓటు వేయకుండానే దొడ్డిదారిన ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు.


నామినేషన్ల పరిశీలన సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై వైసీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. త్రీ టౌన్ పోలీసులు తమ అభ్యర్థులకు రక్షణగా ఉండి స్క్రూటినీలో పాల్గొనేలా చేస్తామని నమ్మబలికి లోపలికి తీసుకెళ్లారని, తీరా అక్కడికి వెళ్లాక లోపల ఉన్న 400 మంది టీడీపీ నాయకులతో కలిసి పోరెడ్డి నరసింహ రెడ్డి నామినేషన్ పత్రాలను చింపివేసి ఆయనపై దాడి చేశారని, దళిత కౌన్సిలర్ అభ్యర్థిని సైతం అవమానించారని తెలిపారు. మరోవైపు దాదాపు 108 మంది వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థులు, ప్రపోజర్లు, సపోర్టర్లను లోపలికి అనుమతించకపోవడంతో, ఇదేమిటని ప్రశ్నించిన వైసీపీ శ్రేణులపై పోలీసులు విచక్షణారహితంగా దాడులు చేశారని ఆరోపించారు. 4వ వార్డు ఎస్టీ అభ్యర్థి రాగుల శాంతి ప్రపోజర్ అయిన రాజశేఖర్‌పై డీఎస్పీ ఫైబర్ స్టిక్‌తో దాడి చేయడంతో అతని కంటి రెటీనాకు తీవ్ర గాయమై ఏడు కుట్లు పడ్డాయని, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి తరలించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే గౌతమ్ రెడ్డి అనే మరో కార్యకర్త తలకు గాయమైందని, తమ కుటుంబ సభ్యులకు దెబ్బలు తగిలినా భరిస్తాం కానీ, పార్టీ కోసం పనిచేసే సామాన్య కార్యకర్తలపై పోలీసులు రౌడీల్లా దాడి చేయడం అత్యంత బాధాకరమని, ప్రజాస్వామ్యాన్ని పోలీసులు వివస్త్రను చేస్తుంటే టీడీపీ నేతలు మానభంగం చేస్తున్నారని, దీనికి డీజీపీ, జిల్లా ఎస్పీ, ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.


ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి కుటుంబం తమ కుటుంబ సభ్యులకే అన్ని పదవులు దక్కాలనే దురాశతో ప్రొద్దుటూరులో 1980ల నాటి ఫ్యాక్షన్ సంస్కృతిని మళ్లీ రగులుస్తోందని, పట్టణాన్ని బీహార్‌గా మారుస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. చంద్రబాబు, లోకేష్ ఆదేశాలతో ఉమ్మడి కడప జిల్లాలో ప్రతిపక్షాలు నామినేషన్లు వేయకుండా పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారని, ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లోనూ ఇదే వైఖరి కొనసాగితే తీవ్ర పర్యవసానాలు ఉంటాయని, దీనిని వారి భావి తరాలు అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ అక్రమాలపై మరియు నంద్యాల రాఘవరెడ్డి అభ్యర్థిత్వంపై ఎన్నికల కమిషన్, జిల్లా కలెక్టర్, మున్సిపల్ చీఫ్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన శ్రేణులకు ధన్యవాదాలు తెలుపుతూ, ప్రజలు, వ్యాపారుల మద్దతు ఉన్న పోరెడ్డి నరసింహ రెడ్డిని ప్రస్తుతం కుట్రతో పదవికి దూరం చేసినా, భవిష్యత్తులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి కాగానే ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. నామినేషన్లకే ఇంతటి దౌర్జన్యం చేసిన వారు రేపు ప్రజలను స్వేచ్ఛగా ఓటు వేయనిస్తారా అని ప్రశ్నిస్తూ, ఈ నియంతృత్వ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడాలని పిలుపునిచ్చారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వైసీపీ కార్యకర్తలపై దాడులు చేసిన పోలీసులు తమ విధానాన్ని మార్చుకోవాలని, లేనిపక్షంలో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ శేఖర్ యాదవ్, వైసీపీ మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి నరసింహ రెడ్డి, పట్టణ వైసీపీ అధ్యక్షుడు భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page