తోటి అభ్యర్థులకు అండగా నామినేషన్ ఉపసంహరణ: రాచమల్లు రమాదేవి

తోటి అభ్యర్థులకు అండగా నామినేషన్ ఉపసంహరణ: టీడీపీ దుష్ప్రచారంపై మండిపడ్డ రాచమల్లు రమాదేవి

కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని 39వ వార్డుకు తాను వేసిన నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంపై తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సతీమణి రమాదేవి తీవ్రంగా ఖండించారు. మున్సిపాలిటీలోని మొత్తం 52 వార్డులకు గాను 51 వార్డుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నామినేషన్లను టీడీపీ నేతలు చెల్లనివ్వకుండా చించివేశారని, కేవలం తన ఒక్క నామినేషన్‌ను మాత్రమే ఉద్దేశపూర్వకంగా మిగిల్చారని ఆమె ఆరోపించారు. అంతేకాకుండా, వైసీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పోరెడ్డి నరసింహారెడ్డితో పాటు ఇతర అభ్యర్థులపై దాడులకు పాల్పడ్డారని, తన కళ్లెదుటే వైసీపీ మహిళా అభ్యర్థుల పట్ల టీడీపీ నేతలు అసభ్యకరంగా ప్రవర్తించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తోటి అభ్యర్థులకు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామన్న ఉద్దేశంతోనే తాను నామినేషన్ విత్ డ్రా చేసుకున్నానని స్పష్టం చేసిన ఆమె, సుప్రీంకోర్టు తీర్పుకు తాము కట్టుబడి ఉన్నామని, న్యాయస్థానం మళ్లీ పోటీ చేసే అవకాశం కల్పిస్తే తప్పకుండా ఎన్నికల బరిలో ఉంటామని తేల్చిచెప్పారు. ఇకనైనా తమపై ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలని టీడీపీ నేతలకు రమాదేవి హితవు పలికారు.





Comments