top of page

ఐస్ క్రీమ్ ముసుగులో ‘గంజాయి’ దందా: యూపీ కిలాడీని కటకటాల్లోకి నెట్టిన ప్రొద్దుటూరు పోలీసులు!

Writer: VOICE OF HERALD
VOICE OF HERALD
Aug 25
1 min read

ఐస్ క్రీమ్ ముసుగులో ‘గంజాయి’ దందా: యూపీ కిలాడీని కటకటాల్లోకి నెట్టిన ప్రొద్దుటూరు పోలీసులు!

ప్రొద్దుటూరు (క్రైమ్ విభాగం):


పైకి అమాయకంగా ఐస్ క్రీములు అమ్ముతూ, తెరవెనుక పక్కా ప్లాన్‌తో మత్తు సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న ఓ అంతర్రాష్ట్ర గంజాయి విక్రేత ఆటను ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీసులు చాకచక్యంగా కట్టడి చేశారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం కనౌజ్ జిల్లా మహువపూర్ గ్రామానికి చెందిన పింటూ అలియాస్ పింటూ కుమార్ (33) కొద్దిరోజుల క్రితం ప్రొద్దుటూరు టౌన్‌కు వలస వచ్చాడు. స్థానిక ఈశ్వర్ రెడ్డి నగర్‌లోని ఓ ఐస్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ, ఎవరికీ ఎటువంటి అనుమానం రాకుండా ఐస్ క్రీములు అమ్మే ముసుగులో యువతకు గంజాయిని ఎరగా వేయడం మొదలుపెట్టాడు. సుమారు 10 రోజుల క్రితం ఇతర ప్రాంతాల నుంచి పెద్ద మొత్తంలో గంజాయిని అక్రమంగా రవాణా చేసి, చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి గుట్టుచప్పుడు కాకుండా విక్రయాలు సాగిస్తున్నాడు.


మెరుపు దాడితో రెడ్ హ్యాండెడ్‌గా పట్టివేత:


ఈ అక్రమ మత్తు దందాపై పక్కా సమాచారం అందుకున్న ప్రొద్దుటూరు వన్ టౌన్ సీఐ టి.వి. కొండారెడ్డి, ఎస్ఐ జి. మధుసూదన్ రెడ్డి తమ సిబ్బందితో కలిసి అప్రమత్తమయ్యారు. ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్, పంచాయతీదారుల సమక్షంలో మంగళవారం (25.08.2026) ఉదయం 8:15 గంటల ప్రాంతంలో రామేశ్వరం సమీపంలోని ఆర్టీపీపీ (RTPP) క్రాస్ రోడ్డు వద్ద గంజాయి విక్రయిస్తుండగా పోలీసులు ఆకస్మిక దాడి జరిపి నిందితుడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి సుమారు రూ. 20,000/- విలువ చేసే మొత్తం 1,280 గ్రాముల గంజాయి (1220 గ్రాముల లూజ్ గంజాయి + 11 చిన్న పాకెట్లు) స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయి పింటూపై NDPS చట్టం-1985 కింద (Cr.No. 175/2026) కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏఎస్పీ యు. విభు కృష్ణన్ (IPS) వెల్లడించారు. పట్టణంలో మత్తు పదార్థాల విక్రయాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page