ప్రొద్దుటూరులో వైసీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పోరెడ్డి నామినేషన్, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ధ్వజం

కూటమి అక్రమాలకు ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారు: ప్రొద్దుటూరులో వైసీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పోరెడ్డి నామినేషన్, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ధ్వజం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పోరెడ్డి నరసింహా రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, రాచమల్లు శివప్రసాద్ రెడ్డిల ఆశీస్సులతో నామినేషన్ వేశానని తెలిపిన పోరెడ్డి, గత వైసీపీ హయాంలోనే పట్టణం గణనీయంగా అభివృద్ధి చెందిందని, ప్రజలు తనపై చూపిస్తున్న ఆదరణతో విజయం సాధించి మున్సిపాలిటీని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తానని స్పష్టం చేశారు. ఈ నెల 28న జరగనున్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పడం ఖాయమని ఆయన పేర్కొన్నారు.
మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, కూటమి అనైక్యతపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి తన సోదరుడు రాఘవ రెడ్డిని చైర్మన్ పీఠంపై కూర్చోబెట్టేందుకు నిబంధనలను తుంగలో తొక్కి కామనూరు నుంచి వైఎంఆర్ కాలనీకి ఓటు మార్చాలని చూస్తున్నారని ఆరోపించారు. బీసీ మహిళకు దక్కాల్సిన రిజర్వేషన్‌ను అప్రజాస్వామికంగా అన్‌రిజర్వ్‌డ్‌గా మార్చారని మండిపడ్డారు. అధికారులపై ఒత్తిడి తెచ్చినా ఫలితం లేకపోవడంతో హైకోర్టుకు వెళ్లారని, కోర్టు రికార్డులు పరిశీలించమని ఉత్తర్వులు జారీ చేస్తే, ఓటు బదిలీ అయిపోయినట్లు టీడీపీ సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాఘవ రెడ్డికి అక్రమంగా ఓటు కల్పిస్తే ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో కొత్తగా మరో ఆరు వేల ఓట్లు చేర్చాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
అధికారులు చట్టబద్ధంగా వ్యవహరించాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే నామినేషన్ల పరిశీలనలో (స్క్రూటినీ) రాఘవ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ప్రశ్నిస్తామని రాచమల్లు హెచ్చరించారు. అవసరమైతే హైకోర్టు లేదా సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేస్తామని, అక్రమంగా గెలిచినా పదవి నుంచి తొలగించే వరకు వదిలిపెట్టబోమని తేల్చిచెప్పారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రవర్తన కూడా పలు అనుమానాలకు తావిస్తోందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, ప్రజాక్షేత్రంలోనైనా, న్యాయస్థానంలోనైనా అంతిమంగా ప్రజాస్వామ్యమే గెలుస్తుందని, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అక్రమార్కులకు బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.



Comments