వన్యప్రాణుల చర్మాల ముఠా అరెస్ట్

మైదుకూరులో వన్యప్రాణుల చర్మాల ముఠా అరెస్ట్

వైఎస్సార్ జిల్లా మైదుకూరులో వన్యప్రాణుల చర్మాల అక్రమ రవాణా ముఠా గుట్టును అటవీ శాఖ అధికారులు రట్టు చేశారు. బెంగళూరు నుంచి ఏపీ సరిహద్దులోకి ప్రవేశించిన ఈ ముఠా కదలికలపై అటవీ శాఖ ప్రత్యేక బృందం పక్కా నిఘా ఉంచింది. సమాచారం మేరకు మైదుకూరులోని బద్వేల్ రోడ్, శాంతినికేతన్ చౌడేశ్వరి నగర్‌లోని ఓ ఇంట్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ దాడిలో మడక ప్రసాద్, అట్లూరుకు చెందిన కాటా దాసరి వెంకటయ్య, కర్ణాటకకు చెందిన గొట్టపోయిన ప్రసాద్‌లను అదుపులోకి తీసుకోగా, వారి నుంచి 5 చర్మాలు, 23 వన్యప్రాణుల గోర్లు, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న చర్మాలను వెటర్నరీ నిపుణులు పరిశీలించగా, అందులో ఒకటి అసలైన దుప్పి చర్మమని, మిగిలినవి నకిలీ పులి చర్మాలని తేలింది.
ఈ ముఠాకు కడప నగరంతోనూ సంబంధాలు ఉన్నట్లు డీఎఫ్‌వో రాజశేఖర్ బాబు, సబ్ డీఎఫ్‌వో సంకేత్ సునీల్ గరుడ్, ఎఫ్ ఆర్ ఓ హేమాంజలి వెల్లడించారు. ఈ కేసులో పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం అటవీ శాఖ అధికారులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. వన్యప్రాణుల అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని అధికారులు హెచ్చరించారు.





Comments