పాస్టర్ల మధ్య వివాదం బేతనియ చర్చికి తాళాలు
- VOICE OF HERALD

- 4 hours ago
- 1 min read
పాస్టర్ల మధ్య వివాదం బేతనియ చర్చికి తాళాలు

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
కడప జిల్లా ప్రొద్దుటూరులోని విజయనగరం వీధిలో ఉన్న బేతనీయ చర్చిలో పాస్టర్ల మధ్య నెలకొన్న వివాదం ఉద్రిక్తతకు దారి తీసింది. చర్చి నిర్వహణ, పాస్టర్ పదవిపై విభేదాలు తలెత్తడంతో చర్చి గేట్లకు తాళాలు వేయడం కలకలం రేపింది. దీంతో భక్తులు, కొత్త పాస్టర్ రోడ్డుపైనే కూర్చుని ప్రార్థనలు నిర్వహించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.ప్రొద్దుటూరులోని బేతనీయ చర్చికి ఇటీవల నూతన పాస్టర్‌గా సాల్మన్ బాబును నియమించినట్లు తెలుస్తోంది. అయితే చాలా కాలంగా చర్చిలో సేవలందిస్తున్న పాస్టర్ ఎఫ్రాయిమ్ తాను చర్చిని విడిచి వెళ్లబోనని స్పష్టం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వివాదం తీవ్రరూపం దాల్చింది.ఆదివారం ప్రార్థనలు జరగాల్సిన సమయంలో చర్చి గేట్లకు తాళాలు వేసి లోపలికి ఎవరినీ అనుమతించలేదని కొత్త పాస్టర్ వర్గం ఆరోపిస్తోంది. దీంతో చర్చిలో ప్రార్థనలు నిర్వహించలేకపోయిన భక్తులు, కొత్త పాస్టర్ సాల్మన్ బాబుతో కలిసి చర్చి బయట రోడ్డుపైనే మోకాళ్లపై కూర్చుని ప్రార్థనలు నిర్వహించారు.చర్చి గేట్ల ఎదుట భక్తులు ప్రార్థనలు చేస్తుండగా, ఈ దృశ్యాలు స్థానికంగా ఆసక్తికరంగా మారాయి. చర్చి వ్యవహారంలో తలెత్తిన ఈ వివాదానికి త్వరగా పరిష్కారం చూపాలని భక్తులు కోరుతున్నారు.ప్రొద్దుటూరులో బేతనీయ చర్చి వివాదం ఎటువైపు దారి తీస్తుందన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇరువర్గాల మధ్య నెలకొన్న విభేదాలు ఎలా పరిష్కారమవుతాయో వేచి చూడాలి.




Comments