మున్సిపల్ ఆస్తుల పరిరక్షణతో పాటు పట్టణ సుందరీకరణే ధ్యేయం: జాయింట్ కలెక్టర్ నిధి మీనా

మున్సిపల్ ఆస్తుల పరిరక్షణతో పాటు పట్టణ సుందరీకరణే ధ్యేయం: జాయింట్ కలెక్టర్ నిధి మీనా

ప్రొద్దుటూరు పట్టణ పరిధిలోని మున్సిపల్ ఆస్తులకు పటిష్ట రక్షణ కల్పిస్తూ, అదే సమయంలో పట్టణ సుందరీకరణకు తగిన ప్రణాళికాబద్ధమైన చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ మరియు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి శ్రీమతి నిధి మీనా మున్సిపల్ అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక శివాలయం సర్కిల్‌లోని మున్సిపల్ స్థలాన్ని మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్‌తో కలిసి ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సదరు స్థలాన్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పెద్ద ఎత్తున మొక్కలు నాటి, ఆహ్లాదకరమైన పచ్చదనంతో సుందరీకరించాలని సూచించారు. పట్టణంలో ఖాళీగా ఉన్న మున్సిపల్ స్థలాలకు స్పష్టమైన సరిహద్దులు నిర్ణయించి, ఎటువంటి ఆక్రమణలకు తావులేకుండా టౌన్ ప్లానింగ్ అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని ఆమె స్పష్టం చేశారు.
మున్సిపల్ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా కాపాడుతూనే, స్థానిక ప్రజలకు ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడమే ప్రధాన లక్ష్యంగా అధికారులు పనిచేయాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. శివాలయం సర్కిల్‌లోని స్థలాన్ని సుందరమైన ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన సమగ్ర ప్రణాళికతో తక్షణమే డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) తయారు చేసి సమర్పించాలని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (DY.EE) రాజేష్‌ను ఆమె ఆదేశించారు. మున్సిపల్ పరిధిలోని ప్రతి ఖాళీ స్థలాన్ని సద్వినియోగం చేసుకుంటూ, ప్రజోపయోగ పనులకు ప్రాధాన్యతనిచ్చి పట్టణ రూపురేఖలను మార్చేలా చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.





Comments