top of page

మాజీ ఎమ్మెల్యే రాచమల్లుపై టీడీపీ నేత జెబీఉల్లా నిప్పులు: ‘ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాభవం ఖాయం!’

Writer: VOICE OF HERALD
VOICE OF HERALD
Aug 25
1 min read

మాజీ ఎమ్మెల్యే రాచమల్లుపై టీడీపీ నేత జెబీఉల్లా నిప్పులు: ‘ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాభవం ఖాయం!’

ఈరోజు సమావేశంలో మాట్లాడుతున్న టిడిపి జిల్లా కార్యదర్శి జెబీఉల్లా
ఈరోజు సమావేశంలో మాట్లాడుతున్న టిడిపి జిల్లా కార్యదర్శి జెబీఉల్లా

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరులో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కడప జిల్లా తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కార్యదర్శి జెబీఉల్లా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రొద్దుటూరు మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ఏకగ్రీవం కానివ్వబోమని, వైసీపీ గెలుస్తుందని రాచమల్లు పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీకి కనీసం పోటీ చేయడానికి అభ్యర్థులే దొరకని దయనీయ పరిస్థితి నెలకొందని, అందుకే రాచమల్లులో ఈ విధమైన ఆందోళన, ఆరాటం మొదలయ్యాయని విమర్శించారు. గతంలో తాము వేసిన రోడ్లపై నిలబడి తామే నిర్మించామని చెప్పుకునే దిగజారుడు రాజకీయాలు రాచమల్లు మానుకోవాలని, ప్రొద్దుటూరు మార్కెట్‌ను తన స్వంత ఆదాయ వనరుల కోసమే ఖాళీ చేయించారని జెబీఉల్లా దుయ్యబట్టారు.


రాచమల్లు హయాంలో ప్రొద్దుటూరులో సాగిన అరాచకాలు, కౌన్సిలర్ల మధ్య చిచ్చుపెట్టిన కుట్రపూరిత సంస్కృతి ప్రజలందరికీ తెలుసని జెబీఉల్లా మండిపడ్డారు. వక్ఫ్ బోర్డు స్థలాలు, మసీదుల్లో వివాదాలు సృష్టించి ముస్లిం మైనార్టీలకు ద్రోహం చేశారని, తమ సోదరుడి మరణానంతరం ఆయన కుమారుడిని ఎంతగానో వేధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇండిపెండెంట్‌గా ఏకగ్రీవమైన తమ అభ్యర్థిని పార్టీ నుంచి ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నించారు. బీసీలపై ప్రేమ నటిస్తున్న రాచమల్లు, గతంలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌తో ఎలా ప్రవర్తించారో ప్రజలు మర్చిపోలేదని అన్నారు. టీడీపీ నేత నందం సుబ్బయ్య హత్య కేసులో రాచమల్లు పాత్ర, వాజపేయి నగర్ వాసులకు చేసిన అన్యాయం, కౌన్సిలర్ జయలింగారెడ్డిని వేధించిన తీరు, కొత్తపల్లి పంచాయతీ ఎన్నికల్లో సొంత సామాజిక వర్గానికే చేసిన మోసం వంటి ఎన్నో అంశాలపై ప్రజలు సమాధానం కోరుతున్నారని గుర్తుచేశారు.


త్వరలోనే భారీ హౌసింగ్ స్కామ్‌పై ప్రెస్ మీట్ పెట్టి ఆయన బండారాన్ని బట్టబయలు చేస్తామని జెబీఉల్లా హెచ్చరించారు. ప్రొద్దుటూరులో అమృత్ పథకానికి సంబంధించిన 40 శాతం పనులు టీడీపీ హయాంలోనే జరిగాయని, ముస్లిం మైనార్టీలతో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేసింది ముమ్మాటికీ తెలుగుదేశం పార్టీయేనని స్పష్టం చేశారు. 'మిమ్మల్ని గద్దె దించుతామని చెప్పాం... చెప్పినట్లే అధికారం నుంచి దించి కౌన్సిలర్ స్థాయికి తీసుకువచ్చాం' అంటూ చురకలంటించారు. రానున్న ఎన్నికలు అత్యంత పారదర్శకంగా, నిజాయితీగా జరగబోతున్నాయని, ప్రజాక్షేత్రంలో రాచమల్లుకు, వైసీపీకి మరోమారు ఘోర పరాజయం తప్పదని స్పష్టం చేశారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page