ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా నంద్యాల రాఘవరెడ్డి: ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి వెల్లడి

ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా నంద్యాల రాఘవరెడ్డి: ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి వెల్లడి

ప్రొద్దుటూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కూటమి తరపున మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా తన సోదరుడు నంద్యాల రాఘవరెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేసినట్లు స్థానిక శాసనసభ్యులు నంద్యాల వరదరాజులరెడ్డి ప్రకటించారు. శనివారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పలువురి సూచనలు, సలహాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చైర్మన్ అభ్యర్థిగా రాఘవరెడ్డితో పాటు, మున్సిపాలిటీలోని 52 వార్డులలో కూటమి కౌన్సిలర్ అభ్యర్థులను బరిలోకి దింపుతున్నట్లు వెల్లడించారు. గడచిన 2 సంవత్సరాల 6 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తామని, ప్రభుత్వం తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిజాయితీతో కూడిన పరిపాలన అందిస్తామని హామీ ఇచ్చారు. రాఘవరెడ్డి ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని, ఓటర్లు తమ అమూల్యమైన రెండు ఓట్లను కూటమి అభ్యర్థులకే వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు.
అనంతరం చైర్మన్ అభ్యర్థి నంద్యాల రాఘవరెడ్డి మాట్లాడుతూ.. గడచిన నాలుగు దశాబ్దాలుగా తమ కుటుంబం నిరంతరం ప్రజా సేవలోనే ఉందని గుర్తుచేశారు. తాము నీతి, నిజాయితీ, నిబద్ధతతో కూడిన పరిపాలన అందించాం కాబట్టే 2024 ఎన్నికలలో ప్రజలు తమకు పట్టం కట్టారని తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా ప్రజలు తనకు ఓటు వేసి ఆశీర్వదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో టీడీపీ కార్యదర్శి ముక్తియార్ మాట్లాడుతూ.. నంద్యాల రాఘవరెడ్డి అభ్యర్థిత్వాన్ని తాము పూర్తిగా సమర్థిస్తున్నామని, పరిపాలనకు మరియు ప్రజా సేవకు వయసు ఎప్పుడూ అడ్డంకి కాదని స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజా దోపిడీ జరిగిందని, 2024 ఎన్నికల్లో ప్రజలు గట్టి బుద్ధి చెప్పినా వైసీపీ నేతల్లో ఇంకా మార్పు రాలేదని విమర్శించారు. వైసీపీ నాయకుల లాగా తాము దౌర్జన్యాలకు పాల్పడబోమని తెలిపారు. ఈ నెల 19వ తేదీ నుండి ఎన్నికల ప్రచారాన్ని (కాన్వాస్) ప్రారంభిస్తామని, గతంలో ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో వైసీపీ చేసిన అవినీతిని ప్రజలకు వివరించి కూటమి విజయానికి కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.



Comments