పెరిగిన ధరలు, ఆకలి కేకలు: ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఫైర్

కూటమి పాలనలో పెరిగిన ధరలు, ఆకలి కేకలు: ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఫైర్

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు ‘అన్నపూర్ణ’గా విలసిల్లితే, ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు ఆకలి బాధలతో అలమటించే దుస్థితి ఏర్పడిందని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బియ్యం, కందిపప్పు, చక్కెర, చింతపండు, మిర్చి, కొబ్బరి వంటి నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటాయని, సామాన్యులు జీవనం సాగించలేని దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని ఆయన విమర్శించారు. ఒకవైపు నిత్యావసరాల ధరలు పెరిగి, రాష్ట్ర అప్పుల భారం తారస్థాయికి చేరుతుంటే, మరోవైపు అన్నదాతలు పండించిన పంటలకు కనీస గిట్టుబాటు ధర కూడా దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని గాలికి వదిలేసిన చంద్రబాబు విజనరీ పాలన అంటే ఇదేనా అని ఆయన నిలదీశారు. నిత్యావసరాల ధరల పెరుగుదలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో త్వరలోనే రాష్ట్రవ్యాప్త ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు.
స్థానిక వ్యాపారుల ప్రయోజనాలను కాపాడే విషయంలో పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేస్తూ, ప్రొద్దుటూరులో కార్పొరేట్ వ్యాపార సంస్థల విస్తరణను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని రాచమల్లు తెలిపారు. కార్పొరేట్ కంపెనీలు వస్తే తప్పేంటని స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి మాట్లాడటం బాధ్యతారాహిత్యమని ఆయన మండిపడ్డారు. భారీ కార్పొరేట్ సంస్థల రాకతో చిరు వ్యాపారులు, స్థానిక వర్తకులు రోడ్డున పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కార్పొరేట్ సంస్థలు వెంటనే ఇక్కడి నుంచి వెనుదిరగాలని, లేనిపక్షంలో స్థానిక వ్యాపారులకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.




Comments