అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎన్టీఆర్ భరోసా పింఛన్లు - మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస విశ్వనాధ్

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎన్టీఆర్ భరోసా పింఛన్లు - మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస విశ్వనాధ్

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ పథకానికి అర్హులైన పేదలందరూ దరఖాస్తు చేసుకోవాలని ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ పిలుపునిచ్చారు. నిరుపేదలకు ఆర్థిక భద్రత కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం కొత్త పింఛన్ల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించిందని తెలిపారు. ఈ నెల సెప్టెంబర్ 7 నుంచి సెప్టెంబర్ 16 వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుందని, గడువు ముగిసేలోపు అర్హులైన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఈ సందర్భంగా కమిషనర్ సచివాలయ సిబ్బందితో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. అర్హత ఉన్న ఏ ఒక్క లబ్ధిదారుడూ పింఛను దక్కకుండా నష్టపోకూడదని స్పష్టం చేశారు. 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులతో పాటు చేనేత, గీత కార్మికులు, మత్స్యకారులు, డప్పు కళాకారులు, చర్మకారులు, ట్రాన్స్‌జెండర్లు తగిన ధ్రువీకరణ పత్రాలతో స్థానిక వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు.






Comments