top of page

అవినీతి వెల్ఫేర్ అసిస్టెంట్ ఆట కట్టించిన మున్సిపల్ కమిషనర్

Writer: VOICE OF HERALD
VOICE OF HERALD
44 minutes ago
1 min read

ప్రొద్దుటూరులో పేదల సొమ్ము వాపస్ ఇప్పించిన మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్: అవినీతికి పాల్పడితే క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరిక

ప్రొద్దుటూరు: ఎన్టీఆర్ భరోసా పింఛన్ల నమోదు ప్రక్రియలో భాగంగా పేదల నుంచి అక్రమంగా వసూలు చేసిన నగదును మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ దగ్గరుండి తిరిగి ఇప్పించారు. అర్హత ఉండి కూడా పింఛన్లు రాని లబ్ధిదారుల వివరాలను సెప్టెంబర్ 7 నుంచి 16వ తేదీ లోపు ఎన్టీఆర్ భరోసా పోర్టల్‌లో నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే, ఇదే అదునుగా భావించిన 7వ వార్డు వెల్ఫేర్ అసిస్టెంట్ చెన్న సుదర్శన్, నమోదు పేరుతో 10 మంది లబ్ధిదారుల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ. 200 చొప్పున అక్రమంగా వసూలు చేశాడు. ఈ అంశంపై ప్రజల నుంచి వాట్సాప్ ద్వారా సమాచారం అందుకున్న కమిషనర్, వెంటనే స్పందించి ఆకస్మిక తనిఖీ నిర్వహించి బాధితులతో స్వయంగా మాట్లాడి నిజానిజాలు నిర్ధారించుకున్నారు.


వెంటనే సదరు లబ్ధిదారుల ఇళ్లకు చేరుకున్న కమిషనర్, వెల్ఫేర్ అసిస్టెంట్ చెన్నా సుదర్శన్ ద్వారా వసూలు చేసిన నగదును బాధితులకు తిరిగి అప్పగించారు. తన సిబ్బంది చేసిన తప్పుకు స్వయంగా లబ్ధిదారులకు క్షమాపణలు చెప్పిన కమిషనర్, సదరు వెల్ఫేర్ అసిస్టెంట్‌కు వివరణ కోరుతూ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ పథకాల అమలులో పేదల నుంచి లంచాలు తీసుకుంటూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని సిబ్బందిని హెచ్చరించారు. ప్రజా సమస్యపై తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేసిన కమిషనర్ తీరుపై స్థానికులు హర్షం వ్యక్తం చేయగా, ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కార్యాలయం కూడా ప్రజలను అప్రమత్తం చేసింది.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page