విద్యుత్ షాక్ గురైన యువకుడిని పరామర్శించిన మున్సిపల్ కమిషనర్

విద్యుత్ షాక్‌కు గురైన యువకుడికి మెరుగైన వైద్యం అందించాలి: ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్

ప్రొద్దుటూరు ఆర్ట్స్ కాలేజీ రోడ్డులోని వినాయక మండపం వద్ద జరిగిన విద్యుత్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి సందీప్ (16)ను మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ పరామర్శించారు. స్థానిక శాసనసభ్యులు నంద్యాల వరదరాజులరెడ్డి ఆదేశాల మేరకు తక్షణమే స్పందించిన ఆయన, గాంధీరోడ్డులోని హోలిస్టిక్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న సందీప్ ఆరోగ్య పరిస్థితిని వైద్య నిపుణులు డాక్టర్ జైచంద్రారెడ్డిని అడిగి తెలుసుకున్నారు. బాధితుడికి అవసరమైన నాణ్యమైన చికిత్సను అందించే అంశంపై వైద్యులతో చర్చించడంతో పాటు, ఆందోళనలో ఉన్న కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు; బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.

ఈ దుర్ఘటనపై సంబంధిత యంత్రాంగం నుంచి పూర్తి వివరాలు సేకరించిన కమిషనర్, ఉత్సవాల వేళ ఇలాంటి విషాదాలు పునరావృతం కాకుండా ముందస్తు భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి సారించారు. పట్టణంలోని వినాయక మండపాలు, వాటి పరిసర ప్రాంతాలలో విద్యుత్ తీగలు, సరఫరా వ్యవస్థలకు సంబంధించి తనిఖీలు నిర్వహించి, రక్షణ నిబంధనలను మరింత పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజా భద్రత విషయంలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించరాదని, ఉత్సవ నిర్వాహకులు సైతం తగిన జాగ్రత్తలు పాటించేలా చూడాలని ఆయన స్పష్టం చేశారు.






Comments