top of page

మున్సిపల్ అధికారులు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవు - మున్సిపల్ కమిషనర్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Aug 3
  • 1 min read

మున్సిపల్ అధికారులు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవు - మున్సిపల్ కమిషనర్

మాట్లాడుతున్న మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ విశ్వనాథ్
మాట్లాడుతున్న మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ విశ్వనాథ్

"ప్రొద్దుటూరు మున్సిపాలిటీ అభివృద్ధి నా ధ్యేయం" - మున్సిపల్ కమిషనర్ టి. శ్రీనివాస్ విశ్వనాథ్


ప్లాస్టిక్ రహిత పట్టణం, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి


ప్రొద్దుటూరు, వైయస్సార్ కడప జిల్లా


ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన టి. శ్రీనివాస్ విశ్వనాథ్ సోమవారం సాయంత్రం మున్సిపల్ కార్యాలయంలోని తన చాంబర్‌లో పాత్రికేయులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మున్సిపాలిటీ అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలను ప్రకటించారు.


అభివృద్ధే లక్ష్యం


కమిషనర్ మాట్లాడుతూ "ప్రొద్దుటూరు మున్సిపాలిటీ అభివృద్ధి నా ప్రధాన ధ్యేయం" అని స్పష్టం చేశారు. ముఖ్యంగా పట్టణంలోని మౌలిక వసతుల కల్పన, ప్రధాన మురుగు కాలువల్లో పూడిక తీత పనులు చేపట్టడం, మరియు ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీగా ప్రొద్దుటూరును తీర్చిదిద్దడం తన ప్రాధాన్యతలని తెలిపారు.


స్వచ్ఛ సంకల్ప దీక్ష


ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 'స్వచ్ఛ సంకల్ప దీక్ష' పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా మున్సిపాలిటీ పరిధిలో పలు ప్రక్షాళన కార్యక్రమాలు చేపట్టినట్లు, ఈ కార్యక్రమాల్లో ప్రజలను కూడా భాగస్వాములు కావాలని కోరారు.


పనుల్లో పారదర్శకత ఉండాలని, ఎక్కడా అవినీతికి తావు లేకుండా, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పనులు సాఫీగా సాగేలా శానిటేషన్ సిబ్బందికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశానని చెప్పారు.


అవినీతి ఆరోపణలపై స్పందన


ఈ సమావేశంలో కమిషనర్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి సోమవారం ఉదయం చేసిన అవినీతి ఆరోపణలపై కూడా స్పందించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సంబంధిత సిబ్బందిని వెంటనే మరో శాఖకు తాత్కాలిక బదిలీ చేసినట్లు, అదే సమయంలో ఈ విషయంపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.


"మున్సిపల్ సిబ్బంది ఎవరైనా చేతివాటం ప్రదర్శిస్తే తన దృష్టికి నేరుగా తీసుకురావాలనీ, తన పేరు చెప్పి లేదా తనపై నేరుగా ఆరోపణలు వచ్చినా ఏసీబీని ఆశ్రయించవచ్చు" అని ఆయన కఠినంగా హెచ్చరించారు.


పారిశుధ్యం - ప్రధాన ప్రాధాన్యత


పారిశుధ్యంపై రానున్న రోజుల్లో యుద్ధప్రాతిపదికన పనులు ముందుకు సాగేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు కమిషనర్ వెల్లడించారు. పట్టణంలో పారిశుధ్యం, త్రాగునీరు, వీధి దీపాల సమస్యలను అత్యంత ప్రాధాన్యతతో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.


ప్రజలకు విజ్ఞప్తి


ప్రతి సోమవారం నిర్వహించే 'డయల్ యువర్ మున్సిపల్ కమిషనర్' కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తమ సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావాలని, ఒక గంటలోనే 26 ఫిర్యాదులు వచ్చాయని, వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామని చెప్పారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page