top of page

కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు.. స్థానిక సమరానికి సిద్ధమవుతున్న శ్రేణులు!

Writer: VOICE OF HERALD
VOICE OF HERALD
Aug 25
2 min read

ప్రొద్దుటూరులో వేడెక్కిన రాజకీయం: కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు.. స్థానిక సమరానికి సిద్ధమవుతున్న శ్రేణులు!

కాంగ్రెస్ పార్టీలో చేరిన కుటుంబాలతో కాంగ్రెస్ నేతలు
కాంగ్రెస్ పార్టీలో చేరిన కుటుంబాలతో కాంగ్రెస్ నేతలు

వైఎస్ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


వైయస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రధాన పార్టీలకు ధీటుగా పావులు కదుపుతూ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఎస్. ఇర్ఫాన్ బాషా పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఇంచార్జ్ ఇర్ఫాన్ భాష ఆధ్వర్యంలో స్థానిక 11వ వార్డు పరిధిలో కడప డీసీసీ అధ్యక్షురాలు ఎన్.డి. విజయజ్యోతి సమక్షంలో ఎస్. మహబూబ్ బాషాతో పాటు సుమారు 40 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాయి. నూతనంగా చేరిన వారికి డీసీసీ అధ్యక్షురాలు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో మహబూబ్ బాషా కాంగ్రెస్ పార్టీ తరఫున 11వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని నాయకత్వం ఈ సందర్భంగా స్పష్టం చేసింది.


ఈ సందర్భంగా కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ ఇర్ఫాన్ బాషా మాట్లాడుతూ స్థానిక పాలకులు, మాజీ ప్రజాప్రతినిధులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత ఐదు దశాబ్దాలుగా ప్రొద్దుటూరులో అభివృద్ధి పూర్తిగా శూన్యమని, పాలకులు పట్టణాన్ని ప్రజా సంక్షేమం కోసం కాకుండా కేవలం వ్యాపార వ్యవస్థగా మార్చుకుని వేల కోట్ల రూపాయలు వెనకేసుకున్నారని ఆరోపించారు. పట్టణంలో ఇప్పటికీ సరైన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, మెడికల్ కాలేజీ వంటి కనీస మౌలిక వసతులు లేకపోవడం పాలకుల అసమర్థతకు నిదర్శనమన్నారు. దాదాపు 70 ఏళ్లుగా తాగునీటి పైప్‌లైన్లు మార్చని దుస్థితి నెలకొందని, కోనేటి కాలువ వీధిలో ప్రజలతో కలిసి ధర్నా చేస్తే తప్ప అధికారులు నిద్రలేవలేదని గుర్తుచేశారు. గతంలో టీడీపీకి గోరీ కడతానన్న మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఏడాదికి రూ. 500 కోట్లు తెచ్చి పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి మాట తప్పారని విమర్శిస్తూ, ఆయన చేసిన అభివృద్ధి ఏమిటో రానున్న ఎన్నికల్లో ప్రజలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. ప్రొద్దుటూరు సమగ్ర అభివృద్ధి కేవలం జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌తోనే సాధ్యమని, రాబోయే స్థానిక ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి ఆదరించాలని పిలుపునిచ్చారు.


డీసీసీ అధ్యక్షురాలు ఎన్.డి. విజయజ్యోతి మాట్లాడుతూ ఓటు హక్కు రాజ్యాంగం ప్రసాదించిన వజ్రాయుధమని, సరైన నాయకులను ఎన్నుకోవడానికి ప్రజలు విజ్ఞతతో వ్యవహరించాలని కోరారు. గత 15 ఏళ్లుగా దేశంలో, రాష్ట్రంలో పాలన పూర్తిగా గాడి తప్పిందని, నాడు కాంగ్రెస్ హయాంలోనే సంక్షేమ పథకాలకు అసలైన పునాది పడిందని గుర్తుచేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ మత విద్వేషాలను రెచ్చగొడుతూ ప్రజల ప్రజాస్వామిక హక్కులను హరిస్తోందని మండిపడ్డారు. ప్రస్తుత గడ్డు పరిస్థితుల్లో దేశానికి రాహుల్ గాంధీ, రాష్ట్రానికి వైఎస్ షర్మిల నాయకత్వం అత్యంత ఆవశ్యకమని, వైఎస్సార్ కడప జిల్లా అభివృద్ధికి షర్మిల నిరంతరం శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. ప్రొద్దుటూరు పట్టణాన్ని దోమల బెడద, పారిశుధ్య లోపం తీవ్రంగా వేధిస్తున్నాయని, ప్రజలు ఇర్ఫాన్ బాషా నాయకత్వానికి అండగా నిలిచి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. పట్టణంలో జరుగుతున్న తాజా చేరికలు పార్టీ క్షేత్రస్థాయి బలాన్ని మరింత పెంచుతున్నాయని ధీమా వ్యక్తం చేశారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page