ఎల్‌నినో పరిస్థితుల్లో పశువుల సంరక్షణ: జమ్మలమడుగులో రైతులకు అవగాహన సదస్సు

ఎల్‌నినో పరిస్థితుల్లో పశువుల సంరక్షణ: జమ్మలమడుగులో రైతులకు అవగాహన సదస్సు

వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావం వల్ల పశుసంవర్ధక రంగానికి ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు ప్రొద్దుటూరు పశువైద్య కళాశాల ఆధ్వర్యంలో జమ్మలమడుగులోని పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పశువైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. జి.ఆర్.కె. శర్మ, పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డా. వీరబ్రహ్మయ్య, అసిస్టెంట్ డైరెక్టర్ డా. శ్రీధర్ రెడ్డి పాల్గొని రైతులు, పారా వెట్స్‌కు దిశానిర్దేశం చేశారు. ఎల్‌నినో పరిస్థితుల్లో ఉష్ణోగ్రతలు పెరిగి పశువుల్లో ‘వేడి ఒత్తిడి’ (Heat Stress) ఏర్పడే ప్రమాదం ఉందని, దీనివల్ల మేత తీసుకోవడం తగ్గి పాల ఉత్పత్తి గణనీయంగా పడిపోతుందని ప్రిన్సిపాల్ వివరించారు. దీని నివారణకు పాడి రైతులకు షెడ్లలో ధారాళంగా గాలి ప్రసరణ, తగినంత నీడ, రోజంతా స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉంచాలని సూచించారు.

పచ్చిమేత కొరతను ముందే గుర్తించి సైలేజ్, ఎండుగడ్డి నిల్వ చేసుకోవడంతో పాటు తక్కువ నీటితో పండే పశుగ్రాసాలను సాగు చేయాలని నిపుణులు కోరారు. పశువులకు సమతుల్య దాణా, ఖనిజ లవణాల మిశ్రమం అందించడం ద్వారా వాటి రోగనిరోధక శక్తిని కాపాడవచ్చని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమ కోఆర్డినేటర్ డా. డి. ఇందిర (ఎల్‌పీఎం విభాగం) పశువుల యాజమాన్య పద్ధతులు, వేడి ఒత్తిడి నివారణపై రైతులకు వివరించగా; కళాశాల అధ్యాపకులు డా. జ్యోతి, డా. సాయి కృష్ణ, డా. చరిత, డా. జాన్, డా. గాయత్రి, డా. మంజుల పశువుల పునరుత్పత్తి, పరాన్నజీవుల నివారణ, వ్యాధుల చికిత్స విధానాలపై సమగ్ర సమాచారాన్ని అందించారు. పశువుల్లో ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేదా వేడి ఒత్తిడి లక్షణాలు కనిపించినా వెంటనే పశువైద్యులను సంప్రదించాలని, ముందస్తు ప్రణాళికతోనే ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని సదస్సులో పిలుపునిచ్చారు.





Comments