22వ వార్డులో వైఎస్సార్‌సీపీలోకి భారీ చేరికలు

22వ వార్డులో వైఎస్సార్‌సీపీలోకి భారీ చేరికలు: రాచమల్లు సమక్షంలో ఫ్యాన్ నీడలోకి 50 కుటుంబాలు

స్థానిక 22వ వార్డులో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వార్డు పరిధిలోని డీజే ఎలక్ట్రికల్ సప్లయర్స్ నిర్వాహకులు మాబు హుస్సేన్, వారి కుటుంబ సభ్యులతో పాటు దాదాపు 50 ముస్లిం కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరాయి. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ శేఖర్ యాదవ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఆయిల్ మిల్ ఖాజా, మాజీ కౌన్సిలర్ జాఫర్ ముఖ్య అతిథులుగా హాజరై నూతనంగా చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచే ఏకైక పార్టీ వైఎస్సార్‌సీపీ అని, వార్డు సర్వతోముఖాభివృద్ధి కోసమే తాము ఎటువంటి ఒత్తిళ్లు లేకుండా స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నామని చేరిన నాయకులు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీ అధికారంలో లేకపోయినా, క్లిష్ట పరిస్థితుల్లోనూ ఎటువంటి లాభాపేక్ష లేకుండా తనపై, వైఎస్సార్‌సీపీ సిద్ధాంతాలపై నమ్మకంతో పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. వార్డులో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న మాజీ కౌన్సిలర్ జాఫర్‌పై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. రానున్న రోజుల్లో 22వ వార్డులో వైఎస్సార్‌సీపీ జెండాను రెపరెపలాడించడమే లక్ష్యంగా పనిచేస్తామని, స్థానిక ఎన్నికల్లో ఛైర్మన్ అభ్యర్థికి ఈ వార్డు నుంచే భారీ మెజార్టీ లభిస్తుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.
అనంతరం కూటమి ప్రభుత్వంపై రాచమల్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సంక్షేమ పథకాల హామీలను ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసి అటకెక్కించిందని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం టీడీపీ వెంటిలేటర్‌పై ఉన్న రోగిలా మారిందని, ఆ వెంటిలేటర్ తొలగిస్తే ఆ పార్టీ ఉనికే ఉండదని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో మోసపూరిత విధానాల వల్ల తాము నష్టపోయినప్పటికీ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే పాలకులకు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అక్టోబర్‌లో చిన్నదినం, 2029లో పెద్దదినం తప్పవని, రానున్న రోజుల్లో ప్రలోభాలకు గురిచేసే కుట్రలను తిప్పికొట్టి సంక్షేమం, మౌలిక వసతులకు పెద్దపీట వేసే వైఎస్సార్‌సీపీకి ప్రజలు మళ్లీ పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు.





Comments