ఎమ్మెల్యే వరద తక్షణమే రాజీనామా చేయాలి – ఇర్ఫాన్ బాషా డిమాండ్
- VOICE OF HERALD

- Jul 30
- 1 min read
ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలి – ప్రొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ ఇర్ఫాన్ బాషా డిమాండ్

ప్రొద్దుటూరు | 30 జూలై 2026
ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ప్రొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ ఇర్ఫాన్ బాషా డిమాండ్ చేశారు. ఈరోజు తన కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నిన్న ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ప్రొద్దుటూరులో అవినీతి విచ్చలవిడిగా ఉందని చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని, అయితే అధికారంలోకి వచ్చి రెండేళ్లకు పైగా గడిచిన తర్వాత ఇప్పుడు అవినీతి ఉందని చెప్పడం గొప్ప విషయం కాదని అన్నారు.
మీ సొంత ప్రభుత్వంలో, మీ సొంత నియోజకవర్గంలో అవినీతి జరుగుతోందని మీరే అంగీకరిస్తే, ఎమ్మెల్యేగా కొనసాగించే నైతిక హక్కు మీకు లేదు. ఇది మీ పరిపాలనా వైఫల్యానికి, అసమర్థతకు నిదర్శనం. అందుకే తక్షణమే రాజీనామా చేసి సమర్థుడైన నాయకుడికి అవకాశం ఇవ్వాలి అని ఆయన పేర్కొన్నారు. గతంలో బెట్టింగ్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతాం అని చెప్పిన ఎమ్మెల్యే, ఈరోజు అదే బెట్టింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులు తన పార్టీలో లేరా అని ప్రశ్నించారు.
అదేవిధంగా భూ మాఫియాపై ఉక్కుపాదం మోపుతాం అని ప్రకటించిన వారు, ఈరోజు తమ పార్టీకి చెందిన నాయకులే భూ దందాలు చేస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. అమృతనగర్‌లో విచ్చలవిడిగా ఆక్రమణలు, కబ్జాలు, దౌర్జన్యాలు జరుగుతున్నాయని, అవి ఎమ్మెల్యేకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
జగన్ అన్న కాలనీల్లో విచారణ పేరుతో పేదల ఇళ్ల నిర్మాణాలను అడ్డుకున్నది మీరే కాదా? అని ప్రశ్నిస్తూ, అక్కడ ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. ప్రొద్దుటూరు అభివృద్ధి కోసం పనులు చేసిన కాంట్రాక్టర్ల బిల్లులను అవినీతి, విచారణపేరుతో వారి బిల్లులు రాకుండా అడ్డుకునింది మీరు కాదా అని ప్రశ్నించారు. స్వేచ్ఛగా పనిచేయాల్సిన అధికారులపై అవినీతి ఆరోపణలు చేయడం మీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు.
మీ పాలనలో ఇన్ని అక్రమాలు, దౌర్జన్యాలు జరుగుతుంటే, ఇప్పుడు అవినీతి గురించి మాట్లాడటం ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. మీరే అవినీతిని అరికట్టలేకపోయామని ఒప్పుకుంటే, ఎమ్మెల్యేగా కొనసాగించే నైతిక హక్కు కోల్పోయారు అని ఇర్ఫాన్ బాషా అన్నారు. ప్రొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ తరఫున మా స్పష్టమైన డిమాండ్ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తక్షణమే రాజీనామా చేసి ప్రజలకు సమాధానం చెప్పాలి అని ఆయన డిమాండ్ చేశారు.




Comments