అభివృద్ధిని పక్కనపెట్టి రాజకీయ విమర్శలు ఏమిటి - ఇర్ఫాన్ భాష
- VOICE OF HERALD

- Jul 17
- 2 min read
అభివృద్ధిని పక్కనపెట్టి రాజకీయ విమర్శలు ఏమిటి - ఇర్ఫాన్ భాష

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరులో అభివృద్ధిని పక్కనపెట్టి రాజకీయ విమర్శలు, పరస్పర ఆరోపణలతోనే నాయకులు కాలం గడుపుతున్నారని కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇంచార్జ్ ఇర్ఫాన్ భాష విమర్శించారు. సోమవారం ప్రొద్దుటూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత 40 ఏళ్లుగా పట్టణ అభివృద్ధి జరగలేదని, ప్రజా సమస్యలను గాలికొదిలేసి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడమే రాజకీయ పార్టీల పనిగా మారిందన్నారు. రహస్య ఒప్పందాలతో రాజకీయాలు చేస్తూ ఘర్షణలకు దిగుతున్న నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు అవినీతి ఆరోపణలు చేసుకోవడం తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు చేయలేదన్నారు. 5 శాతం ఎక్సెస్ పేరుతో అవినీతికి పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన ఆయన, మార్కెట్ నిర్మాణంలో టెండర్లు, రివర్స్ టెండర్ల పేరుతో జరిగిన వ్యవహారాలపై కూడా స్పష్టత ఇవ్వాలని కోరారు. బస్ స్టేషన్ ఇప్పటికీ ప్రారంభం కాకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీలు ఇచ్చినా ప్రొద్దుటూరుకు ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారని, ఆ హామీ ఏమైందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు?
కాలువలు, రోడ్లు వేయడమే అభివృద్ధి కాదని, ఏ ప్రభుత్వం వచ్చినా అలాంటి పనులు చేయడం సహజమేనని అన్నారు. ప్రజల జీవితాలను మార్చేలా ప్రభుత్వం చేసిన ప్రత్యేక అభివృద్ధి ఏమిటో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకోవడం తప్ప ప్రజలకు అందించిన సేవలు ఏమిటో చెప్పాలని నిలదీశారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా ప్రొద్దుటూరులో రాజకీయ ఘర్షణలు జరుగుతున్నాయని, గత ప్రభుత్వాల హయాంలో జరిగిన దాడులు, హత్యలు, అరెస్టులపై సంబంధిత నాయకులు సమాధానం చెప్పాలన్నారు. డీఏడబ్ల్యూ కళాశాల వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే మున్సిపల్ కార్యాలయంలో తనపై జరిగిన దాడి, ఎస్‌ఎస్ మాల్ వ్యవహారం, కొత్తపల్లి పంచాయతీ స్థల వివాదం, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌కు వచ్చిన బెదిరింపులు వంటి ఘటనలను ప్రస్తావిస్తూ, ప్రభుత్వం ఎవరిదైనా ప్రొద్దుటూరులో అసాంఘిక కార్యకలాపాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. మార్కెట్‌లో నిర్మించిన షెడ్లు అక్రమమా, సక్రమమా అనే విషయంపై ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో వరదరాజుల రెడ్డి రెండుసార్లు ఎన్నికల్లో ఓడిపోయిన విషయాన్ని మరిచిపోయారా అని ప్రశ్నించిన ఆయన, ఇప్పుడు గెలిచామని సంబరపడుతున్నారని, అయితే తనకు వ్యతిరేకంగా దాదాపు 90 వేల మంది ఓటు వేసిన విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలని ఘాటుగా వ్యాఖ్యానించారు. నేటి నుంచి కూటమి ప్రభుత్వం చేసే ప్రతి అక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తానని ఇర్ఫాన్ భాష స్పష్టం చేశారు.




Comments