top of page

స్టాంప్ రైటర్లను తొలగించే జి.ఓ. నెం. 396ను తక్షణమే ఉపసంహరించుకోవాలి – ఇర్ఫాన్ బాషా

Writer: VOICE OF HERALD
VOICE OF HERALD
Jul 24
2 min read

స్టాంప్ రైటర్లను తొలగించే జి.ఓ. నెం. 396ను తక్షణమే ఉపసంహరించుకోవాలి – ఇర్ఫాన్ బాషా

24 జూలై 2026 | ప్రొద్దుటూరు


ప్రొద్దుటూరులో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట స్టాంప్ రైటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పెన్‌డౌన్ నిరసన కార్యక్రమంలో ప్రొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ ఇర్ఫాన్ బాషా పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా స్టాంప్ రైటర్ల సమస్యలను తెలుసుకుని, వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి మద్దతు ప్రకటించారు.


ఈ సందర్భంగా ఇర్ఫాన్ బాషా మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం జి.ఓ. నెం. 396 ద్వారా ఎన్నో సంవత్సరాలుగా ప్రజలకు సేవలందిస్తున్న స్వతంత్ర స్టాంప్ రైటర్లను తొలగించి, వారి స్థానంలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఫ్రంట్ ఆఫీస్ వ్యవస్థను ఏర్పాటు చేయడం అత్యంత దురదృష్టకరమని అన్నారు.


స్టాంప్ రైటర్లు కేవలం పత్రాలు రాసే వ్యక్తులు మాత్రమే కాదని, దశాబ్దాల అనుభవంతో ప్రతి డాక్యుమెంట్‌ను చట్టబద్ధంగా, భవిష్యత్‌లో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా రూపొందించే నిపుణులని పేర్కొన్నారు. ఒక సాధారణ వ్యక్తి జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బుతో ఇల్లు లేదా స్థలం కొనుగోలు చేస్తాడని, కోట్ల రూపాయల విలువైన ఆస్తి అయినా సరే దానికి సంబంధించిన డాక్యుమెంట్ సరిగ్గా తయారుకాకపోతే భవిష్యత్‌లో తీవ్రమైన న్యాయపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని అన్నారు.


ఈరోజు తయారయ్యే రిజిస్ట్రేషన్ పత్రాలు రాబోయే తరాలకు, వందల సంవత్సరాల పాటు ఆధారాలుగా నిలుస్తాయని, అలాంటి బాధ్యతను అనుభవం లేని వ్యక్తులకు అప్పగించడం ప్రజల ప్రయోజనాలకు విరుద్ధమని విమర్శించారు.


అలాగే నిన్న స్టాంప్ రైటర్స్ సంఘం నాయకులను చర్చలకు పిలిచి, వారిపై ఒత్తిడి తెచ్చి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయించాలని బెదిరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి, నైతిక విలువలకు విరుద్ధమని ఇర్ఫాన్ బాషా తీవ్రంగా ఖండించారు.


ప్రభుత్వం ఈ నిర్ణయంతో భవిష్యత్‌లో సాధారణ ప్రజలపై అధిక భారం పడే అవకాశముందని, డాక్యుమెంట్లలో తప్పులు జరిగితే ప్రజలు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని, అదనపు ఖర్చులు భరించాల్సి వస్తుందని అన్నారు. అంతేకాకుండా అధికారుల ఆధీనంలో జరిగే వ్యవస్థలో రాజకీయ వివక్షకు కూడా అవకాశం ఉంటుందని, ప్రజలకు సమానమైన సేవలు అందకపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.


అందువల్ల ప్రభుత్వం వెంటనే జి.ఓ. నెం. 396ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ, స్టాంప్ రైటర్ల హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.


అవసరమైతే స్టాంప్ రైటర్ల ఉద్యమంలో వంటా-వార్పు వంటి ఆందోళన కార్యక్రమాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగా పాల్గొంటుందని, వారి న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు పోరాటానికి పూర్తి మద్దతు అందిస్తామని ఇర్ఫాన్ బాషా ప్రకటించారు.


ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గోసంగి సుబ్బారెడ్డి, మైనారిటీ నాయకులు మౌలాలి, షేక్ గౌస్, స్టాంప్ రైటర్స్ అసోసియేషన్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో స్టాంప్ రైటర్లు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page