top of page

మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచాలి, 12వ పీఆర్సీని తక్షణమే నియమించాలి: గాజువాక జోనల్ కార్యాలయం వద్ద జీవీఎంసీ సిబ్బంది భారీ ధర్నా

Writer: EDITOR
EDITOR
Sep 30
1 min read

మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచాలి, 12వ పీఆర్సీని తక్షణమే నియమించాలి: గాజువాక జోనల్ కార్యాలయం వద్ద జీవీఎంసీ సిబ్బంది భారీ ధర్నా

రాష్ట్రవ్యాప్త నిరసనల్లో భాగంగా మున్సిపల్ కార్మికులకు వేతనాల పెంపు, 12వ పీఆర్సీ (PRC) కమిషన్ ఏర్పాటు, అలాగే కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు డీఏ, మధ్యంతర భృతి (ఐఆర్) వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ గాజువాక, అగనంపూడి జోన్ పరిధిలోని జీవీఎంసీ కార్మికులు గాజువాక జోనల్ కార్యాలయం వద్ద నిరసన ధర్నా నిర్వహించారు. నక్క నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో యూనియన్ గౌరవ అధ్యక్షులు పి. వెంకట్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలలో పనిచేస్తున్న దాదాపు 60 వేల మంది, అలాగే జీవీఎంసీ పరిధిలోని 7 వేల మంది కార్మికులు గడచిన మూడేళ్లుగా జీతాల పెంపు, పీఆర్సీ కోసం ఎదురుచూస్తున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి 12వ పీఆర్సీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.


ఉమ్మడి రాష్ట్రంలో సీఐటీయూ పోరాటాల ఫలితంగా మున్సిపల్ కార్మికులకు పీఆర్సీ వేతనాలు, డీఏ, ఐఆర్ చెల్లించేందుకు జారీ చేసిన జీవో ఆర్టీ నెం. 1615ను ప్రస్తుత ధరల పెరుగుదలకు అనుగుణంగా తక్షణమే అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. గత ఎనిమిదేళ్లలో నిత్యావసర సరుకుల ధరలు, ఇంటి అద్దెలు, పిల్లల ఫీజులు, వైద్య ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంట్ చార్జీలు రెట్టింపయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో 11వ పీఆర్సీని కూడా రెండేళ్లు ఆలస్యంగా అమలు చేశారని, ప్రభుత్వాలు సకాలంలో జీతాలు పెంచకపోవడం వల్ల కాంట్రాక్ట్, ఔట్‌‌సోర్సింగ్ కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారని పేర్కొన్నారు.


తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించి కార్మికులను ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించాలని కోరుతూ, శానిటరీ సూపర్‌వైజర్ ఎస్.ఎస్. కోటేశ్వరరావు ద్వారా కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు గొలగాని అప్పారావు, ఎం. రాంబాబు, బంగారు నాయుడు, కె.వి. రమణ, రాము, చిన్నారావు, మీనాక్షి, మంగమ్మ, రామారావులతో పాటు పెద్ద సంఖ్యలో మున్సిపల్ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page