వివోపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరం
- VOICE OF HERALD

- Jul 8, 2022
- 1 min read
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివోపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరం చేసింది

తాజాగా వివో సంస్థకు చెందిన 119 బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసింది. ఈ ఖాతాలకు అనుబంధంగా రూ.465 కోట్ల ఫిక్స్ డ్ డిపాజిట్లు ఉండగా, ఈ ఖాతాల్లో రూ.73 లక్షల నగదు, 2 కిలోల బంగారు కడ్డీలు గుర్తించారు.కాగా, వివో తన ఆదాయంలో 50 శాతాన్ని రూ.62,476 కోట్లు చైనాలోని తన మాతృసంస్థకు చేరవేసిందని ఈడీ వెల్లడించింది. భారత్ లో భారీగా పన్నులు ఎగవేయడానికే ఈ విధంగా ఆదాయ తరలింపు చేపట్టిందని ఆరోపించింది. భారత్ లో తమకు విపరీతమైన నష్టాలు వచ్చాయని, అందుకే పన్నులు చెల్లించలేకపోతున్నామని చూపడానికే ఈ తరలింపులు జరిగాయని ఈడీ వివరించింది.కాగా, వివో, దాని అనుబంధ సంస్థలపై ఈడీ రెండ్రోజుల కిందట సోదాలు నిర్వహించింది. దేశంలోని 44 ప్రాంతాల్లో మనీలాండరింగ్ చట్టం కింద ఈ సోదాలు జరిపింది.ఇటీవల, తమ గుర్తింపు పత్రాలను కొందరు చైనా వాటాదారులు ఫోర్జరీ చేశారంటూ జమ్మూ కశ్మీర్ కు చెందిన ఓ డిస్ట్రిబ్యూటర్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఆరోపణల ఆధారంగా ఈడీ కూడా మనీలాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు షురూ చేసింది. ఇటీవల కొంతకాలంగా చైనా వ్యాపార సంస్థలపై భారత కేంద్ర ప్రభుత్వం నిశితంగా దృష్టి సారించింది..



Comments