రైతులకు అధికారిక రాజముద్రతో నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ: ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి

ప్రొద్దుటూరులో రైతులకు అధికారిక రాజముద్రతో నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ: ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి

వైఎస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు నియోజకవర్గం చౌడూరు గ్రామంలో రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్థానిక స్వర్ణ గ్రామం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని, అర్హులైన రైతులకు స్వయంగా పాస్ పుస్తకాలను అందజేశారు. చౌడూరు గ్రామంలో మొత్తం 923 మంది పట్టాదారులు ఉండగా, రీ-సర్వే విజయవంతంగా పూర్తయిన 876 మంది రైతులకు మొదటి విడతలో వీటిని పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. కూటమి ప్రభుత్వ హయాంలో ఎలాంటి రాజకీయ నాయకుల ఫొటోలు లేకుండా, అత్యంత పారదర్శకంగా కేవలం ప్రభుత్వ అధికారిక రాజముద్రతోనే ఈ పాస్ పుస్తకాలను అందజేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రైతుల భూమి హక్కు పత్రాలపై అప్పటి సీఎం జగన్ ఫొటోలు ముద్రించి రాజకీయం చేశారని వరదరాజుల రెడ్డి ఈ సందర్భంగా విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పద్ధతికి స్వస్తి పలికి, ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేలా రాజముద్రతో పత్రాలను అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కూటమి పాలనలో చౌడూరు గ్రామాన్ని అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ అధికారులు డిప్యూటీ తహసీల్దార్ సుదర్శన్, ఆర్ఐ నాగమోహన్ రెడ్డి, మార్కెట్ యార్డ్ ఇన్‌ఛార్జ్ చైర్మన్ పట్నం లక్ష్మణ్, టీడీపీ ముఖ్య నేతలు రవికుమార్ రెడ్డి, శంకరాపురం మారుతి ప్రసాద్ రెడ్డితో పాటు గ్రామ రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





Comments