అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
- EDITOR

- Jul 4
- 1 min read
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి

తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన కవయిత్రి, మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజుల పత్తిపాటి మాట్లాడుతూ, రైతు కష్టం అనేది కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదని, ప్రకృతి వైపరీత్యాలతో పాటు కోతులు, అడవి పందుల బెడద రైతన్నకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందని అన్నారు.
అడవుల నరికివేత వల్ల కోతులు, అడవి పందులు తమ సహజ ఆవాసాలను కోల్పోయి ఆహారం కోసం గ్రామాలు, నగరాల వైపు వస్తున్నాయని, వాటిని రక్షించడంతో పాటు రైతుల పంటలను కూడా కాపాడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
గతంలో రైతులు పొలాల్లో కూరగాయలు, సజ్జలు, జొన్నలు, మొక్కజొన్న వంటి పంటలను సాగు చేసేవారని, అయితే కోతులు, అడవి పందుల దాడుల కారణంగా ప్రస్తుతం ఎక్కువ మంది రైతులు వరి, పత్తి సాగుకే పరిమితమవుతున్నారని తెలిపారు.
అడవి జంతువుల దాడుల వల్ల జరిగే పంట నష్టాన్ని స్థానిక ప్రకృతి విపత్తుగా గుర్తించి, ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) కింద రైతులకు పూర్తి పంట నష్టపరిహారం సకాలంలో అందేలా ప్రభుత్వం నిబంధనలను మరింత కఠినతరం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
అడవి పందులు పామాయిల్ తోటలను కూడా వదలడం లేదని, తమ బలమైన ముట్టెతో భూమిని తవ్వి వేర్లతో సహా మొక్కలను నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
అడవి పందులు గ్రామాల్లోకి రాకుండా ఉండేందుకు అటవీ శాఖ అడవుల్లో దుంపలు, పండ్ల మొక్కలను విస్తృతంగా నాటడంతో పాటు, నీటి వసతి కోసం చెక్‌డ్యామ్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. అలా చేస్తే అడవి జంతువులు అడవుల్లోనే ఉండి, రైతులు వరికి ప్రత్యామ్నాయంగా వివిధ పంటలను సాగు చేసే పరిస్థితి ఏర్పడుతుందని మంజుల పత్తిపాటి పేర్కొన్నారు.




Comments