కార్పొరేట్ శక్తుల రాకతో ప్రొద్దుటూరు వాణిజ్య రంగానికి ముప్పు: మాజీ ఎమ్మెల్యే రాచమల్లు

కార్పొరేట్ శక్తుల రాకతో ప్రొద్దుటూరు వాణిజ్య రంగానికి ముప్పు: మాజీ ఎమ్మెల్యే రాచమల్లు

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
దక్షిణ భారతదేశంలోనే ప్రముఖ వాణిజ్య కేంద్రంగా, ముఖ్యంగా బంగారు మార్కెట్‌కు పెట్టింది పేరైన ప్రొద్దుటూరు స్థానిక ఆర్థిక వ్యవస్థను కార్పొరేట్ సంస్థలు తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక వ్యాపారులు దశాబ్దాలుగా ప్రజలతో పరస్పర నమ్మకంతో సంబంధాలు కొనసాగిస్తూ, అవసరమైనప్పుడు అప్పు (క్రెడిట్) సౌకర్యం కల్పిస్తూ అండగా నిలుస్తున్నారని గుర్తుచేశారు. అయితే, ప్రధాన పండుగల సీజన్లలో బయటి నుంచి వచ్చే కార్పొరేట్ వ్యాపారాలు భారీ మార్కెటింగ్ వ్యూహాలతో స్థానిక వ్యాపారులను, ముఖ్యంగా స్వర్ణకారులను తీవ్ర ఆర్థిక నష్టాల్లోకి నెట్టివేస్తున్నాయని, ఇది స్థానికులు ఆర్థిక వలసలకు గురయ్యేలా చేస్తుందని స్పష్టం చేశారు.
కేవలం లాభాపేక్షతో మాత్రమే ప్రవేశించే కార్పొరేట్ సంస్థలకు స్థానిక ప్రజలతో ఎటువంటి విశ్వసనీయత లేదా సామాజిక అనుబంధం ఉండదని, స్థానిక వ్యాపారుల్లాగా అవి ప్రజలకు అండగా నిలవలేవని ఆయన పేర్కొన్నారు. తాము అధికారంలో ఉన్న సమయంలో స్థానిక వ్యాపార వర్గాల ప్రయోజనాలను కాపాడుతూ కార్పొరేట్ సంస్థలను ప్రోత్సహించలేదని గుర్తుచేసిన రాచమల్లు, ప్రస్తుతం ఉన్న పాలకులు ప్రొద్దుటూరు స్థానిక మార్కెట్ మనుగడను, కార్మికుల ఉపాధిని కాపాడేందుకు వెంటనే జోక్యం చేసుకుని కార్పొరేట్ శక్తుల దూకుడును అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.





Comments