నీట్ అంశంపై కాంగ్రెస్ రాజకీయాలు మానుకోవాలి – బీజేపీ

నీట్ అంశంపై కాంగ్రెస్ రాజకీయాలు మానుకోవాలి – బీజేపీ

వైఎస్ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
నీట్ (NEET) పరీక్షలో జరిగిన అక్రమాలను సాకుగా చూపిస్తూ కాంగ్రెస్ పార్టీ విద్యార్థులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నించడం అత్యంత బాధాకరమని భారతీయ జనతా పార్టీ ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షులు వంకదారి నరేంద్ర రావు విమర్శించారు. నీట్ పరీక్షలో జరిగిన అక్రమాల వెనుక ఉన్న దోషులను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గుర్తించి అరెస్టు చేసి, సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు.
కాంగ్రెస్ పాలనలో దేశవ్యాప్తంగా 150కి పైగా పేపర్ లీక్ ఘటనలు జరిగినప్పటికీ, ఆ విషయాలపై సమాధానం చెప్పకుండా ఇప్పుడు నీట్ అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించడం ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నమేనని అన్నారు. ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో చర్చకు సిద్ధంగా ఉన్నప్పటికీ, కాంగ్రెస్ నాయకత్వానికి వాస్తవాలపై మాట్లాడే ధైర్యం కనిపించడం లేదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి రాజకీయ పార్టీకి నిరసన తెలిపే హక్కు ఉందని, అయితే నిరసన తెలిపే విధానానికి కూడా హద్దులు, హుందాతనం ఉండాలని అన్నారు. దేశ ప్రధానమంత్రి నివాసం ఎదుట ఆందోళనలు నిర్వహించడం ప్రజాస్వామ్య సంప్రదాయాలకు, రాజకీయ మర్యాదలకు విరుద్ధమని విమర్శించారు. భారతీయ జనతా పార్టీ ఎన్నో సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఇలాంటి విధానాలను ఎప్పుడూ ప్రోత్సహించలేదని గుర్తుచేశారు.
ప్రభుత్వం సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్న సమయంలో విద్యార్థులను రెచ్చగొట్టి వారి భవిష్యత్తును అనిశ్చితిలోకి నెట్టడం బాధ్యతాయుత రాజకీయాలకు విరుద్ధమని అన్నారు. యువత భవిష్యత్తు విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును రాజకీయాల కోసం ఉపయోగించవద్దని కాంగ్రెస్ పార్టీ, శ్రీ రాహుల్ గాంధీ, శ్రీమతి ప్రియాంక గాంధీని భారతీయ జనతా పార్టీ తరఫున కోరారు. ప్రెస్ మీట్‌లో బీజేపీ జిల్లా కార్యదర్శి అంకిరెడ్డి పల్లె చిరంజీవి రెడ్డి, పట్టణ ఉపాధ్యక్షులు రవి ప్రకాష్, పట్టణ కార్యదర్శి మురళి, బీజేపీ నాయకులు చరణ్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.





Comments