సబ్ స్టేషన్ నిర్మాణాన్ని ఆపాలని కాంగ్రెస్ నిరసన
- VOICE OF HERALD

- 6 days ago
- 1 min read
సబ్ స్టేషన్ నిర్మాణాన్ని ఆపాలని కాంగ్రెస్ నిరసన

కడప జిల్లా, ప్రొద్దుటూరు
శ్రీనివాసనగర్ నందు తలపెట్టిన నూతన విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణాన్ని వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎస్. ఇర్ఫాన్ భాష ఆధ్వర్యంలో స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. "సబ్ స్టేషన్ నిర్మాణం ఆపాలి" అంటూ నినాదాలు చేస్తూ చేపట్టిన ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నివాస ప్రాంతాల మధ్యలో సబ్ స్టేషన్ నిర్మిస్తే తమ ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజల ప్రాణాలకు ముప్పు - ఇర్ఫాన్ భాష ఆరోపణ
ఈ సందర్భంగా ఇర్ఫాన్ భాష మాట్లాడుతూ దశాబ్దాలుగా ఈ స్థలం వివాదంలో ఉందని గుర్తు చేశారు. 2004లో అమృతమయి ట్రస్ట్ కు ఈ స్థలాన్ని అప్పగించారని, గతంలో పేదలకు ఇళ్లు నిర్మించేందుకు ప్రభుత్వం ల్యాండ్ అక్విజిషన్ చేసిందని తెలిపారు. "ఊరి బయట ఉండాల్సిన సబ్ స్టేషన్ ను ఇళ్ల మధ్యలో నిర్మించడం ఏమిటని? గతంలో ఇక్కడ 20 ఏళ్ల కుర్రాడు విద్యుత్ ప్రమాదానికి బలయ్యాడన్నారు. అగ్ని ప్రమాదాలు కూడా జరిగాయి" అని ఆయన గుర్తు చేశారు. అధికార బలంతో ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా నిర్మాణాలు చేపట్టడం సరికాదన్నారు.
వెంటనే పనులు నిలిపివేయాలి
సబ్ స్టేషన్ కు ఫైర్ సేఫ్టీ చర్యలు ఉన్నాయా అని ఇర్ఫాన్ భాష అధికారులను నిలదీశారు. "అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ప్రజలకు భరోసా కల్పించాలి" అని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేను ఉద్దేశించి సూటిగా ప్రశ్నిస్తూ, నివాస ప్రాంతాలకు దగ్గరగా సబ్ స్టేషన్ వద్దని తాము గతంలోనే నిరసన తెలిపినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ ప్రమాదాలు, అగ్ని ప్రమాదాల ముప్పు దృష్ట్యా నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.





Comments