మున్సిపల్ ఎన్నికల విజయవంతానికి పకడ్బందీ శిక్షణ: మాస్టర్ ట్రైనర్లతో కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ కీలక సమీక్ష

మున్సిపల్ ఎన్నికల విజయవంతానికి పకడ్బందీ శిక్షణ: ప్రొద్దుటూరులో మాస్టర్ ట్రైనర్లతో కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ కీలక సమీక్ష

2026 పురపాలక ఎన్నికల సజావు నిర్వహణలో భాగంగా ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలో మాస్టర్ ట్రైనర్లతో మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరగడంలో శిక్షణ పొందిన సిబ్బందిదే అత్యంత కీలక పాత్ర అని స్పష్టం చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి నిబంధనలు, పోలింగ్ రోజు పాటించాల్సిన జాగ్రత్తలు, ఈవీఎంలు/సామగ్రి వినియోగం, ఓటింగ్ నిర్వహణ వంటి అంశాలపై పూర్తి స్పష్టతతో ప్రామాణిక శిక్షణ అందించాలని ట్రైనర్లను ఆదేశించారు. ఎక్కడా చిన్నపాటి పొరపాట్లకు కూడా తావులేకుండా నిబంధనలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, క్షేత్రస్థాయి సిబ్బందికి సులభంగా అర్థమయ్యేలా వివరించాలని, సమన్వయంతో పనిచేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించాలని సూచించారు.
ఈ ఎన్నికల ప్రక్రియ కోసం పురపాలక సంఘం పరిధిలో విధులు నిర్వర్తించే సుమారు 500 మంది పోలింగ్, కౌంటింగ్ సిబ్బందికి మొత్తం 14 మంది మాస్టర్ ట్రైనర్ల ఆధ్వర్యంలో స్థానిక అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ నందు మూడు దశల్లో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. పోలింగ్ వేళల్లో ఎదురయ్యే సాంకేతిక సమస్యలు, సవాళ్లను ముందుగానే గుర్తించి సిబ్బందికి ఉన్న సందేహాలను నివృత్తి చేయాలని కమిషనర్ దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్ష సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ మంజునాథ్ గౌడ్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ సి.టి. కృష్ణ సింగ్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ జి. చంద్రమోహన్‌లతో పాటు మాస్టర్ ట్రైనర్లు టి. కుళాయి రెడ్డి, వి. రవీంద్ర రెడ్డి, ఈ. అమర్నాథ్ రెడ్డి, ఎస్. మనోహర్ రెడ్డి, డి. భాస్కర్ రావు, డి. సలీం, కె. వెంకటేశు, టి. ప్రశాంత్ రాజు, డి. మల్లికార్జున రెడ్డి, వై. సుబ్రమణ్యం, కె. రామ లక్ష్మయ్య, యు. రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. తమకు కేటాయించిన బాధ్యతలను ఎన్నికల నిబంధనలకు లోబడి చిత్తశుద్ధితో నిర్వహించాలని అధికారులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.






Comments