కామ్రేడ్ సీతారాం ఏచూరి ద్వితీయ వర్ధంతి సంస్మరణ సభను జయప్రదం చేయండి: సీపీఎం నేత కామనూరు పిలుపు

కామ్రేడ్ సీతారాం ఏచూరి ద్వితీయ వర్ధంతి సంస్మరణ సభను జయప్రదం చేయండి: సీపీఎం నేత కామనూరు పిలుపు

సీపీఐ(ఎం) మాజీ ప్రధాన కార్యదర్శి, ప్రముఖ పార్లమెంటేరియన్ కామ్రేడ్ సీతారాం ఏచూరి ద్వితీయ వర్ధంతిని పురస్కరించుకుని కడపలో నిర్వహించనున్న సంస్మరణ సభ ప్రచార గోడపత్రాలను కమలాపురం స్థానిక క్రాస్ రోడ్స్ వద్ద శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కామనూరు శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ, విద్యార్థి దశ నుంచే రాజకీయ పోరాటాలు ప్రారంభించి, ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో ధైర్యంగా నిలబడిన గొప్ప యోధుడు ఏచూరి అని కొనియాడారు. మార్క్సిస్టు సిద్ధాంతవేత్తగా దేశంలో వామపక్ష, లౌకిక విలువల పరిరక్షణకు, సామాజిక న్యాయ సాధనకు జీవితాంతం అంకితభావంతో పనిచేశారని ఆయన సేవలను స్మరించుకున్నారు.
సెప్టెంబర్ 12 (శనివారం) ఉదయం 10:00 గంటలకు కడప బాలాజీ నగర్‌లోని యుటీఎఫ్ (UTF) ఉపాధ్యాయ భవన్‌లో "వర్తమాన ప్రపంచం - భారత రాజకీయాలు" అనే ప్రధాన అంశంపై ఈ సంస్మరణ సభ జరగనుంది. కామ్రేడ్ జి. చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగే ఈ సదస్సులో సీనియర్ నాయకులు కందారపు మురళి ముఖ్య వక్తగా ప్రసంగించనుండగా, నేతలు ఎ. రామమోహన్, వి. అన్వేష్, బి. మనోహర్, జి. శివకుమార్ తదితరులు ప్రసంగిస్తారు. దేశంలో రాజ్యాంగ విలువల పరిరక్షణే ఏచూరికి ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొంటూ ప్రజాస్వామ్యవాదులు, కార్మికులు, రైతులు, విద్యార్థులు, మేధావులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ పోస్టర్ ఆవిష్కరణలో నాయకులు మద్దెల రాజేష్, శామీర్, రవి చౌడయ్య, సుబ్బరాయుడు, ముక్తియార్, రఫీ, డానియల్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.





Comments