top of page

సినీ, రాజకీయరంగాల్లో ఎన్టీఆర్‌ది చెరగని ముద్ర - బాలకృష్ణ

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Mar 15, 2023
  • 1 min read

సినీ, రాజకీయరంగాల్లో ఎన్టీఆర్‌ది చెరగని ముద్ర: బాలకృష్ణ

జన్మనిచ్చి అభిమానుల గుండెల్లో స్థానం కల్పించిన తన తండ్రి ఎన్టీఆర్ శత జయంత్యుత్సవాలకు హాజరుకావడం సంతోషంగా ఉందని ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు..

ఎన్టీఆర్‌ శత జయంత్యుత్సవాలను పురస్కరించుకుని గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా అలనాటి నటి సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి, నాగిరెడ్డి కుమారుడు విశ్వనాథరెడ్డికి 'ఎన్టీఆర్‌' పేరిట అవార్డులను బాలకృష్ణ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

''సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్‌ చెరగని ముద్ర వేశారు. ఆయన ఎవరి రుణం ఉంచుకోలేదు. చెన్నైకి తెలుగు గంగ ద్వారా నీరు అందించారు. కష్టపడి పనిచేశారు కాబట్టే బి.నాగిరెడ్డి, సావిత్రి గార్లను ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు. వాళ్లు చేసిన సినిమాలు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. నటన అంటే సావిత్రిలా ఉండాలి.. ఆమె నటన అజరామరం. అందుకే ఆమె మహానటిగా అందరి గుండెల్లో నిలిచిపోయారు. ఎన్టీఆర్ అవార్డు అందుకునేందుకు సావిత్రి కుమార్తె చాముండేశ్వరి రావడం ఆనందంగా ఉంది.


తెనాలి ప్రాంతం ఎందరో ప్రముఖులు, కవులు, కళాకారులకు జన్మనిచ్చిన ప్రాంతం. వారంతా సినిమా రంగంపై చెరగని ముద్ర వేశారు. ఎన్టీఆర్‌తో నటించిన వారంతా చిరస్మరణీయులే. ఇవాళ పాతాళ భైరవి సినిమా విడుదలైన రోజు కావటం మరో విశేషం. కమర్షియల్‌ సినిమాలకు ఎన్టీఆర్‌ ఆద్యులు. ఆయన నటించిన భక్తిరస సినిమాలు ఎంతో పేరు తెచ్చి పెట్టాయి.. ప్రజల్లో భక్తిభావం పెంపొందించాయి. నాన్న గారిలా నేను కూడా కులమతాలకు అతీతం. నా అభిమానులు నా కుటుంబంలో భాగమే'' అని బాలకృష్ణ అన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page