top of page

ప్రొద్దుటూరు అభివృద్ధికి రూ. 40 కోట్లు.. గత వైసీపీ హయాంలో రూ. 100 కోట్ల అవినీతి: ఎమ్మెల్యే వరద ధ్వజం

Writer: VOICE OF HERALD
VOICE OF HERALD
Oct 13
1 min read

ప్రొద్దుటూరు అభివృద్ధికి రూ. 40 కోట్లు.. గత వైసీపీ హయాంలో రూ. 100 కోట్ల అవినీతి: ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ధ్వజం

వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని స్థానిక నంద్యాల వరదరాజుల రెడ్డి స్పష్టం చేశారు. పట్టణ సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం రూ. 40 కోట్ల నిధులు మంజూరు చేసిందని, అందులో భాగంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాంతాల్లో పనులు చేపడుతున్నామని తెలిపారు. ఈ క్రమంలోనే మంగళవారం రూ. 7 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మక గాంధీ రోడ్డు విస్తరణ పనులకు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. పేదలు, సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే తమ ప్రభుత్వ ధ్యేయమని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూపే ప్రజలను ఓట్లు అడుగుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

అదే సమయంలో గత వైసీపీ పాలనపై, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి పనులు చేపట్టకుండా దాదాపు రూ. 100 కోట్ల ప్రజాధనాన్ని అప్పటి ఎమ్మెల్యే, చైర్మన్ కుమ్మక్కై స్వాహా చేశారని ఆరోపించారు. తాత్కాలిక కూరగాయల మార్కెట్ నిర్మాణంలోనే ఏకంగా రూ. 20 కోట్ల మేర అవకతవకలు జరిగాయని మండిపడ్డారు. బీసీ వర్గానికి చెందిన మహిళను నామమాత్రంగా చైర్మన్‌గా కూర్చోబెట్టి, అధికారాలన్నీ రాచమల్లే చెలాయించారని విమర్శించారు. కనీసం వాటర్ వర్క్స్ వెళ్లే రోడ్డును, పేదలు నివసించే ప్రాంతమనే వివక్షతో రామేశ్వరం రోడ్డును కూడా వేయలేకపోయారని దుయ్యబట్టారు. గతంలో దోచుకున్న ఆ రూ. 100 కోట్ల లెక్కలను ప్రజల ముందు నిగ్గుతేలుస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page