top of page

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినందుకే నాకు కోపం వచ్చింది - మాజీ ఎమ్మెల్యే రాచమల్లు

Writer: VOICE OF HERALD
VOICE OF HERALD
54 minutes ago
1 min read

116 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి.. ప్రొద్దుటూరులో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు: మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ధ్వజం

కడప జిల్లా ప్రొద్దుటూరు పురపాలక సంఘం ఏర్పడిన 116 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బలవంతపు ఏకగ్రీవాలు జరిగాయని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రొద్దుటూరు నియోజకవర్గ వ్యాప్తంగా వైసీపీ తరపున దాఖలైన 88 నామినేషన్లలో 86 నామినేషన్లను అన్యాయంగా తిరస్కరించారని, కనీసం 16 మంది కౌన్సిలర్ అభ్యర్థులను నామినేషన్ కూడా వేయనివ్వకుండా అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికల అధికారులు, పోలీసులు మరియు ఎమ్మెల్యే అనుచరులు కుమ్మక్కై తమపై దాడులు చేశారని, స్క్రూటినీకి కూడా తమ అభ్యర్థులను రానివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం తన భార్య (39వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి రమాదేవి), రాజుపాలెం జడ్పీటీసీ అభ్యర్థి నామినేషన్లు మాత్రమే చెల్లడం విచిత్రంగా ఉందని, బీసీలకు దక్కాల్సిన మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని ఓసీ జనరల్‌కు వెళ్లేలా ఎమ్మెల్యే కుట్ర పన్నారని ఆయన విమర్శించారు.


ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోలేదని, టీడీపీ గెలవలేదని.. కేవలం ప్రజాస్వామ్యం, ప్రజలు మాత్రమే ఓడిపోయారని రాచమల్లు వ్యాఖ్యానించారు. వైసీపీ సుప్రీంకోర్టుకు వెళ్లినా, ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయంటూ కలెక్టర్ తప్పుడు నివేదికలు పంపిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే నాయకులు అవుతారు కానీ పోలీసుల సహకారంతో గెలిస్తే ప్రజా నాయకులు కాలేరని ఎద్దేవా చేశారు. అధికారుల నుంచి ఏకగ్రీవ డిక్లరేషన్ పత్రాలు తీసుకుంటున్నప్పుడు టీడీపీ నేతల ముఖాల్లో కనీసం గెలుపు సంతోషం కూడా కనిపించలేదని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినందుకే తనకు కోపం వచ్చిందే తప్ప తాను ఎప్పుడూ అసభ్యకరమైన భాష మాట్లాడలేదని స్పష్టం చేశారు. తనను భాష మార్చుకోమనే ముందు ప్రత్యర్థులు తమ బుద్ధి మార్చుకోవాలని ఆయన హితవు పలికారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page