రాచమల్లు నిరాధార ఆరోపణలపై అధికారుల ఆగ్రహం

రాచమల్లు నిరాధార ఆరోపణలపై అధికారుల ఆగ్రహం

ప్రొద్దుటూరు, అక్టోబరు 26: ఎన్నికల విధులు నిర్వహిస్తున్న తమపై డబ్బులు తీసుకున్నామని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి చేసిన ఆరోపణలను ప్రొద్దుటూరు పురపాలక సంఘం ఎన్నికల అధికారులు సంయుక్తంగా ఖండించారు. రాజకీయ విమర్శల కోసం ప్రభుత్వ అధికారులను లక్ష్యంగా చేసుకోవడం, ఆధారాలు లేని అసత్య ఆరోపణలు చేయడం తగదని వారు హితవు పలికారు. నామినేషన్ల స్వీకరణ నుంచి ఉపసంహరణ వరకు ఎన్నికల కమిషన్ నిబంధనలకు లోబడి, ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విధులు నిర్వహించామని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియపై ఏవైనా అనుమానాలు ఉంటే తగిన ఆధారాలతో అధికారికంగా ఫిర్యాదు చేయాలే తప్ప, అధికారుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయవద్దని, ఆ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

తన విధి నిర్వహణలో ఎలాంటి అక్రమాలకు, పక్షపాతానికి తావివ్వలేదని అసిస్టెంట్ ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ తేల్చిచెప్పారు. తాను డబ్బులు తీసుకున్నట్లు చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, ఈ నిరాధార ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని జిల్లా కలెక్టర్‌ను కోరనున్నట్లు ఆయన వెల్లడించారు. వ్యక్తిగత, రాజకీయ విమర్శలకు అధికారులను బలి చేయకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని వర్గాలు సహకరించాలని ఎన్నికల అధికారులు వి. హరి ప్రసాద్, ఎస్. సఫీ ఉల్లా బాషా, వి. భాస్కర్, బిపి సంతోష్ కుమార్, పి. లక్ష్మీనరసింహులు, జె. శివకుమార్, కె. మంజునాథ్, ఎం. చంద్రఓబుల్ రెడ్డి, పి. పరమేశ్వరరెడ్డి, బి. నరేంద్ర విజ్ఞప్తి చేశారు.





Comments