ప్రజాస్వామ్యంలో మార్పు రావాలి - ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి
- EDITOR

- 4 days ago
- 1 min read
ప్రజాస్వామ్యంలో మార్పు రావాలి - ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి, అధ్యక్షులు, వైయస్సార్ కడప జిల్లా రచయితల సంఘం

రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, సమానత్వం, ప్రాథమిక హక్కుల అమలులో ఆశించిన పురోగతి లేదని, అందువల్ల ప్రజాస్వామ్యంలో మార్పు అనివార్యమని వైయస్సార్ కడప జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు, వై.వి.యు పాలకమండలి సభ్యులు ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి అన్నారు. వైయస్సార్ కడప జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఉదయం యోగివేమన విశ్వవిద్యాలయం వీసీ ఛాంబర్ లో విశ్రాంత అధ్యాపకులు నెల్లిపల్లి సిద్దయ్య పరిశోధన చేసి ఆంగ్ల, తెలుగు భాషల్లో రచించిన "భారతదేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడుందో మీకు తెలుసా? " అనే గ్రంథాలను వై.వి.యు ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆచార్య మల్లికార్జున రెడ్డి గ్రంథాన్ని గురించి సమీక్షిస్తూ.. ప్రజల హక్కులను పరిరక్షించడానికి,బాధ్యతలను నిర్వర్తిండానికి, ప్రజాస్వామ్యం సజావుగా నడవడానికి అవసరమైన అన్ని అంశాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనే సదుద్దేశంతో సిద్దయ్య ఐదేళ్లు నిరంతరం శ్రమించి విలువైన గ్రంథాన్ని తీసుకువచ్చారన్నారు.
ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ సందేశమిస్తూ.. కంటిచూపు లేకపోయినా సిద్దయ్య ఇంత విలువైన సమాచారాన్ని శోధించి పుస్తక రూపంలో ప్రజలకు అందివ్వడం అభినందనీయమన్నారు. కుల సచివులు ఆచార్య పుత్తా పద్మ మాట్లాడుతూ ప్రాచీన కాలం నుంచి నేటి వరకు సమాజంలో వస్తున్న అనేక మార్పుల ఉటంకిస్తూ రచయిత సిద్దయ్య చెప్పిన తీరు ప్రశంసనీయమన్నారు. గ్రంథకర్త నెల్లిపల్లి సిద్దయ్య.. స్పందిస్తూ ప్రజాస్వామ్యం ఒక అధ్యయనమని, ఉన్నత తరగతి ప్రజలు, బహుజనుల పాత్రను అంచనా వేయడానికి ఈ ప్రయత్నం చేశానన్నారు. ఈ పుస్తకం వైయస్సార్ కడప జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో యోగివేమన విశ్వవిద్యాలయం వై ఛాన్సలర్ చేతుల మీదుగా ఆవిష్కృతం కావడం సంతోషాన్నిచ్చిందన్నారు. ఈ కార్యక్రమం లో తెలుగు శాఖ ఆచార్యులు, ప్రముఖ కవి ఆచార్య నల్లపురెడ్డి ఈశ్వర రెడ్డి,శలా అండ్ మేనేజ్మెంట్ డీన్ ఆచార్య వై. సుబ్బరాయుడు, పరీక్షల నిర్వహణ అధికారి ఆచార్య కె.ఎస్.వి. కృష్ణారావు, వైయస్సార్ కడప జిల్లా రచయితల సంఘం కోశాధికారి డాక్టర్ కొప్పోలు రెడ్డి శేఖర్ రెడ్డి, ఉపాధ్యాయుడు కర్రకోటి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.



Comments